అవినీతి చేయకుండా ఉండటం కోసమే సినిమాలు చేస్తాను – పవన్ కళ్యాణ్

Monday, April 5th, 2021, 08:32:25 AM IST

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం వకీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ వేడుక లో పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల తర్వాత మళ్లీ సినీ వేదిక పై మాట్లాడుతూ పవన్ సినీ రంగం పై, కళల పై, వకీల్ సాబ్ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఒక సందర్భంలో రాజకీయ నాయకుల పై విమర్శలు చేశారు పవన్.

పేకాట క్లబ్బులు నడిపేవాళ్ళు ఎమ్మెల్యే లు కావొచ్చు, పైరవీ లు చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు, నేను సినిమాలు చేస్తూ రాజకీయం చేయకూడదా అంటూ చెప్పుకొచ్చారు. అయితే అవినీతి చేయకుండా ఉండటం కోసమే సినిమా చేస్తాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినిమా చేస్తే ప్రత్యక్షం గా పరోక్షంగా ఎంతోమంది కి పని కల్పించిన వారం అవుతాం అని అన్నారు. సినిమా అన్నది డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాదు, పది మంది ఉపాధికి కూడా అని వ్యాఖ్యానించారు. అందరి ఆనందం తో పాటు నాకు డబ్బు వస్తే సంతోషం అని, ఆ డబ్బుని సమాజం కోసమే వినియోగిస్తా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకూ ప్రజలకు సేవ చేస్తా అని, అందులో భాగంగా సినిమాలు కచ్చితంగా చేస్తా అని చెప్పుకొచ్చారు. సినిమాల నుండి పారిపోయే వ్యక్తిని కాదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ ప్రీ రిలీజ్ వేడుక లో సినిమాల గురించి మాట్లాడుతూనే, రాజకీయ నాయకుల బిజినెస్ ల పై సైతం ప్రత్యక్షం గా ఘాటు విమర్శలు చేశారు.