తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి – భట్టి విక్రమార్క

Tuesday, May 18th, 2021, 04:25:36 PM IST


తెలంగాణ రాష్ట్రం లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి ధరలు నిర్ణయించమని హైకోర్ట్ ఆదేశించినా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టలేదు అని ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. అయితే సీఎం కేసీఆర్ దీని పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ జీఓ ఇచ్చారు అని, కానీ ఇప్పుడు ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందో తెలియడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి ఉదృతి పై సీఎస్ కి ఫోన్ చేసి అప్రమత్తం చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే గతం లో సి ఎస్ లాక్ డౌన్ వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. అంతేకాక హైకోర్ట్ ఒత్తిడి తోనే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు అని భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. అయితే తెలంగాణ లో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను గందర గోళం కి గురి చేస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. అంతేకాక వాక్సిన్ తయారీ కంపెనీ లతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తర్వాత నుండి వాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడికి ఐసోలేశన్ కేంద్రాలను పెంచి, పాలనా వికేంద్రీకరణ చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రం లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి అని, గవర్నర్ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలన పై జోక్యం చేసుకోవాలని కోరారు. మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.