ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి మోసం.. భలే నమ్మించారుగా..!

Wednesday, April 7th, 2021, 03:00:50 AM IST


నమ్మేటోడు ఉన్నన్ని రోజులు నట్టేట ముంచెటోడు ఉంటాడన్నది సామెత. అవును ఇది నిజమేనండోయ్ బాబు.. కొందరు కేటుగాళ్లను నమ్మి మోసపోకండని చెప్పినా కూడా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీల పేర్లు వాడుకుని అమాయక జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత పేరు ఉపయోగించుకుని టీవీ ఛానెల్‌లో కీలక పోస్టు ఇప్పిస్తామని, డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పిస్తామని అన్నారు.

కామారెడ్డికి చెందిన మహేష్ గౌడ్, వినోద్ అనే ఇద్దరు కేటుగాళ్లు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకటి, వేములవాడలో మరో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మహమ్మద్ అలియాస్ స్వామి అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు. ఖతర్‌లో ఉండే మహమ్మద్‌ను మోసం చేసి సుమారు 6.50 లక్షలు వసూలు చేశారు. అయితే మహమ్మద్ ఇటీవల ఖతర్ నుంచి రావడంతో ఎమ్మెల్సీ కవిత శాలువా పంపించారంటూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధిచిన తాళాలు అంటూ అతడి చేతిలో రెండు తాళం చెవిలు పెట్టారు. తాను మోసపోయానని గ్రహించిన మహమ్మద్ చివరకు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన కాస్త ఆలస్యమగా వెలుగుచూసింది.