వకీల్‌సాబ్‌ను వెంటాడుతున్న కరోనా భయం.. అలా అయితే కష్టమే..!

Sunday, April 4th, 2021, 01:31:58 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. అయితే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమాకు కరోనా భయం పట్టుకుంది.

అయితే నిజానికి ఈ సినిమా 2020 మే 15నే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. మొన్నటి వరకూ పరిస్థితి బాగానే ఉంది.. థియేటర్లు తెరిచాక చాలా సినిమాలు విడుదలయ్యి అందులో కొన్ని సినిమాలు మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి. అయితే ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో మళ్ళీ లాక్‌డౌన్ అమలు చేసే దిశగా ఆ ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా విడుదలైతే థియేటర్లకు భారీగా అభిమానులు వస్తారని వారిని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని, గుంపులు గుంపులుగా జనం చేరడంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావించి 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను నడిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ వైద్య శాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కర్ణాటకలో 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను నడిపించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంటే వకీల్ సాబ్‌కు కష్టాలు తప్పేలా లేదు. ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా సినిమా కలెక్షన్లపై పడే అవకాశం కనిపిస్తుంది.