టీడీపీ నేత, మాజి ఎంపీ సబ్బం హరి కన్నుమూత

Monday, May 3rd, 2021, 03:25:02 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి కారణంగా తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఇటీవల కోవిడ్ భారిన పడిన ఆయన, గత కొద్ది రోజులుగా విశాఖ లోని అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా వైరస్ కి తోడుగా ఇన్ఫెక్షన్లు ఉండటం తో వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికి మృత్యు వాత పడ్డారు. 1952 జూన్ 1 వ తేదీన జన్మించిన ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

అయితే సబ్బం హరి మృతి పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం సబ్బం హరి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. విశాఖ మేయర్ గా, ఎంపీ గా ఆయన చేసిన సేవలు మరువలేనివి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఆయన కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. అయితే సబ్బం హరి మృతి కి తెలుగు దేశం పార్టీ నేతలు నివాళులు అర్పించారు.