ఈటల వ్యవహారం.. తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ హైకోర్టు..!

Tuesday, May 4th, 2021, 06:25:42 PM IST


గత నాలుగైదు రోజుల నుంచి మాజీ మంత్రి ఈటల భూ కబ్జా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఈటల హైకోర్టును ఆశ్రయించారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసేముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కలెక్టర్ నివేదికను కూడా తమకు అందించలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈటలపై కబ్జా ఆరోపణలతో రైతులు ఫిర్యాదు చేసిన కారణంగానే విచారణ చేపట్టామని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదన వినిపించారు.

అయితే ఇరు వాదనలు విన్న ధర్మాసనం విచారణ జరిగిన తీరును తప్పుపట్టింది. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. అంతేకాదు రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయ్యిందని, ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకెళ్లైనా వెళ్లి విచారణ చేయొచ్చా అని నిలదీసింది. ఈ నివేదికను అధికారులు కారులోనే కూర్చుని రూపొందించినట్టు కనిపిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని, ఆ నోటీసును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.