బిగ్ న్యూస్: ఈటెల రాజేందర్ కి సవాల్ విసిరిన మంత్రి గంగుల కమలాకర్!

Tuesday, May 18th, 2021, 02:03:32 PM IST


తెలంగాణ రాష్ట్రం లో ఈటెల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన అనంతరం నుండి ఈటెల రాజేందర్ అధికార పార్టీ తీరును ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా తన నియోజక వర్గం హుజూరాబాద్ లో సర్పంచు లని, ఎంపీటీసీ మరియు ఎంపీపీ లను బెదిరిస్తున్నారు అంటూ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నియోజక వర్గం ప్రజలు అంతా కూడా తన వెంటే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యం లో మంత్రి గంగుల కమలాకర్ ఈటెల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రం లోనే తేల్చుకుందాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటెల రాజేందర్ కేబినెట్ నుండి బర్తరఫ్ చేసినా పదవి పట్టుకొని ఊగుతున్నారు అంటూ విమర్శించారు. అయితే ఇది ఆత్మ గౌరవమా లేక ఆత్మ వంచనా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి అంటూ సూచించారు. అయితే ప్రజలంతా ఆయన వెంటే ఉన్నప్పుడు రాజీనామా ఎందుకు చేయడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు.