30 నెలలో 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ రామచందర్ రావు – హరీశ్ రావు

Thursday, March 4th, 2021, 03:05:09 AM IST


తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. నేడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిగిలో మహబూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ సెస్‌ల పేరుతో పెట్రోల్ రేట్లను బీజేపీ ప్రభుత్వం పెంచుతూ పోతుందని, పెరిగిన పెట్రోల్ ధరను యాదించుకో అని ఓటర్లకు చెప్పాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఈ లెక్క‌న ఇప్ప‌టికే 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. మ‌రి వ‌చ్చాయా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు రావ‌డం అటుంచి ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టే పార్టీ బీజేపీ అని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడమే బీజేపీ లక్ష్యమని అన్నారు.

అంతేకాదు 30 నెలలో 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ రామచందర్ రావు అని ఆయనకు ఎమ్మెల్సీ అంటే ఇష్టం లేక ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్నార‌ని హరీశ్ రావు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు, రైతు బంధు, రైతు బీమా లేదు. కల్యాణ లక్ష్మీ లేదు. ఇంటింటికి నీళ్లు లేవు అన్నారు. రైతులకి ఉచిత కరెంట్ లేదని ఇవన్ని ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ప్రధానమంత్రి పీవీ గారి కూతురు వాణీదేవి మంచి విద్యావేత్త అని ఆమెను గెలిపించుకోవాలని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.