ఢిల్లీలో ఆమరణ దీక్ష చేద్దామా.. మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్..!

Friday, March 5th, 2021, 04:30:22 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా ఓ సవాల్ విసిరారు. హైదారాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఒకే నాణేనికి బొమ్మాబొరుసని అన్నారు. బయటకి టీఆర్ఎస్, బీజేపీ వేరువేరు అనేలా నటిస్తున్నారని విమర్శించారు. అయితే తెలంగాణకు ఐటీఐఆర్‌ రాలేదని అందుకు బీజేపీనే కారణమని కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు.

అయితే ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేద్దామా అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని, కేటీఆర్‌కు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. అసలు మోదీ అంటే కేసీఆర్‌కు చలి జ్వరమని, తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీతో కేసీఆర్ ఎందుకు జతకట్టాడో చెప్పాలని ప్రశ్నించారు. అంతేకాదు పట్టభద్రులు ఆలోచించి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.