పచ్చ వైరస్ సోకితే పనబాక లక్ష్మి కూడా ఇలా అయిపోతారా? – ఎంపీ విజయసాయి రెడ్డి

Monday, May 3rd, 2021, 05:00:06 PM IST


తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి భారీ మెజారిటీ తో గెలుపొందారు. దాదాపు 2.7 లక్షల ఓట్ల తేడా తో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మి పై విజయం సాధించారు. అయితే వైసీపీ విజయం పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మేరకు మరొకసారి గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. పరువు పోయినా గెలిచిన పార్టీని తక్కువ చేసి మాట్లాడటం బాబుకి అలవాటే అంటూ చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి లో డాక్టర్ గురుమూర్తి 2.71 లక్షల ఘన మెజారిటీ సాధించినా, పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ ఒడినట్టేనట అంటూ చంద్రబాబు నాయుడు తీరును ఎండగట్టారు. అయితే పచ్చ పార్టీ ఓట్ల శాతం 37.65 నుండి 32 శాతానికి పడిపోయిన విషయం పై స్పందించడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే మరొక ట్వీట్ లో తెలుగు దేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్ధి పనబాక లక్ష్మి పై సెటైర్స్ వేశారు. పచ్చ వైరస్ సోకితే పనబాక లక్ష్మి కూడా ఇలా అయిపోతారా అంటూ సూటిగా ప్రశ్నించారు. పచ్చ కామెర్లు సోకిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటూ విమర్శించారు. పచ్చ వైరస్ సోకినా అంతే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కరోనా కన్నా ప్రమాదకరం అని, ఎన్నిసార్లు ట్రీట్మెంట్ ఇచ్చినా లక్షణాలు మళ్ళీ బయట పడుతున్నాయి అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈ మాయదారి రోగానికి ప్రజలే శాశ్వత చికిత్స చేయాలి అంటూ చెప్పుకొచ్చారు.