ఏపీ లో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్

Thursday, April 8th, 2021, 08:38:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం రాష్ట్రం లోని 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మొత్తం 7,735 స్థానాలకి 20,840 మంది అభ్యర్దులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే దాదాపు 2,44,71,002 మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగనుంది. అయితే ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం బ్యాలెట్ బాక్స్ లను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు అధికారులు. అయితే ఈ ఎన్నికల కొరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు సెలవుదినం గా ప్రకటించింది.

షాపులు, కార్యాలయాలు, వ్యాపారాలు అన్నిటికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మరో పక్క కరోనా వైరస్ పాజిటివ్ సోకిన వారి కొరకు పిపిఈ కిట్లు ఇచ్చి, చివరి గంటల్లో పోలింగ్ వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు పక్కగా అమలు చేయనున్నారు. ఓటర్లు మాస్క్ లు పెట్టుకొని విధిగా భౌతిక దూరం పాటించాలి. అయితే థర్మల్ స్కానింగ్ తర్వాతే పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లను అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.