తప్పని తేలితే ఎంపీ గా రాజీనామా చేస్తావా? బండి సంజయ్ కి మంత్రి సూటి ప్రశ్న!

Monday, May 3rd, 2021, 10:10:46 AM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలు మరియు మాట్లాడిన తీరు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి అంటూ విమర్శించారు. అయితే హుందాతనం, పార్టీ అధ్యక్షుడు అన్న విషయాన్ని మర్చిపోయి బండి సంజయ్ మాట్లాడారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాట్లాడే ముందు ఆయన చరిత్ర ఏంటో తెలుసుకొవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ ఉద్యమం లో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు అంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమం లో నీ స్థానం ఏంటి, మా స్థానం ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే తెలంగాణ కోసం కొట్లాడింది మేము అని, ఉద్యమం లో కాల్చి చంపుతామని అన్నా కూడా గుండెలు ఎదురుపెట్టాం అని వ్యాఖ్యానించారు. మీరు ఎవరైనా జైలుకి వెళ్ళారా? ఉద్యమం లో పాల్గొన్నారా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. అయితే ఇప్పటి వరకూ తాము ప్రధాని నరేంద్ర మోడీ పై అసభ్య వ్యాఖ్యలు చేయలేదు అని అన్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వేల ఎకరాలు కబ్జా చేశారని ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే తాము కొన్న భూమికి పాస్ బుక్ ఉందని, తమ సర్వే నంబర్ లో ఉన్న భూమి కంటే ఒక్క గజం ఎక్కువగా ఉన్నా తన ఆస్తి మొత్తం రాసిస్తా అంటూ చెప్పుకొచ్చారు. అయితే సర్వే నంబర్లు, స్థలాలు తప్పైతే తన పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు. అయితే తప్పని తేలితే ఎంపీ గా రాజీనామా చేస్తావా అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు. ఇందుకు బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.