యాచకుడి ఇంట్లో భారీగా బయటపడ్డ డబ్బులు.. ఏడాదిగా ఎవరూ చూడలేదు..!

Tuesday, May 18th, 2021, 01:30:11 AM IST

ఓ ధనవంతుడు యాచకుడిగా, ఓ యాచకుడు ధనవంతుడిగా కనిపించే సీన్లను మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం కానీ నిజ జీవితలో మాత్రం చాలా అరుదు అనే చెప్పాలి. అయితే తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో కట్టలు కట్టలకు నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. దీనిని చూసిన పక్కింటి వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే తిరుమల కొండపై చాలా కాలంగా నిర్వాసితుడైన శ్రీనివాసన్ అనే వ్యక్తికి గతంలో తిరుపతిలోని శేషాచల కాలనీలో రూమ్ నెంబర్ 75ని అతడి నివాసానికి కేటాయించారు.

అయితే తిరుమల కొండపై బిక్షాటన చేసే శ్రీనివాసన్ పొద్దున్నే వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. దీంతో చుట్టు ముట్టు వారితో కూడా అతడికి పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. అయితే గతేడాది అనారోగ్య సమస్యల కారణంగా శ్రీనివాసన్ మరణించాడు. అయితే శ్రీనివాసన్ ఉంటున్న గది చాలా కాలంగా ఖాళీగా ఉంటుందని తెలియడంతో ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు వెళ్ళారు. అయితే ఆ ఇంట్లోని రెండు ట్రంకు పెట్టెలను తెరిచి చూడగా అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ట్రంకు పెట్టెల నిండా డబ్బుల కట్టలు ఉన్నాయి. అయితే ఆ డబ్బును లెక్కించగా దాదాపు పది లక్షలకు పైగా ఉన్నట్టు తెలిసింది. కాగా శ్రీనివాసన్‌కు వారసులు ఎవరూ లేకపోవడంతో టీటీడీ ఆ డబ్బును, ఇంటిని జప్తు చేసింది. ఆ డబ్బునంతా తిరుమల శ్రీవారి సేవలకు వినియోగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.