ఒక్క పరుగు తేడాతో ఢిల్లీపై విజయం సాధించిన ఆర్సీబీ..!

Wednesday, April 28th, 2021, 01:00:23 AM IST

ఐపీఎల్ 2021లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో బెంగుళూరు జట్టు విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు జట్టులో ఏబీ డివిలియర్స్ (75 నాటౌట్) విధ్వంసం సృష్టించడం, రజత్ పాటిదార్(31), గ్లెన్ మ్యాక్స్‌వెల్(25) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను నష్టపోయి 171 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్, రబడా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.

అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్, స్మిత్ వెంట వెంటనే ఔటయ్యారు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్(58), షిమ్రన్ హెట్‌మెయిర్(53) అర్థ సెంచరీలతో మెరిసినా ఢిల్లీ విజయం దక్కించుకోలేకపోయింది. చివరి వరకు పోరాడి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమిని చవిచూసింది. ఇకపోతే ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్‌ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, కైల్ జేమీసన్‌లకు చెరో వికెట్ దక్కింది. ఆర్సీబీ తరపున అర్థ సెంచరీతో మెరిసిన ఏబీ డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.